హైదరాబాద్, వెలుగు: మారుతున్న నేరాల స్వరూపం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగ్గట్టుగా తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందిని బలోపేతం చేస్తున్నదని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీస్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బుధవారం రాష్ట్ర పోలీస్ అకాడమీలో సమీక్ష జరిగింది. కార్యక్రమలో డీజీపీ సీవీ ఆనంద్ సహా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ సహా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పోలీసింగ్ స్వరూపం మారిందని.. ప్రస్తుత కాలంలో మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసాలు, ఆహార కల్తీ పెరిగిపోయాయన్నారు. గత ఏడాది జరిగిన సైబర్ మోసాల్లో రాష్ట్రంలో రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారన్నారు. .
గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ సిబ్బంది 8 విభాగాలకు..
పునర్వ్యవస్థీకరణ చర్యలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీకి చెందిన 513 మంది సిబ్బందిని ఎనిమిది విభాగాలకు కేటాయించామని డీజీపీ తెలిపారు. అత్యధికంగా 224 మంది సిబ్బందిని ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగానికి, 80 మందిని ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్,79 మందిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు కేటాయించామని చెప్పారు. మరో 28 మంది సిబ్బందిని పౌర సరఫరాలకు, 27 మందిని డీజీపీ ఆఫీసులోని టీ-స్పార్క్‌కు, 25 మంది చొప్పున ఏసీబీకి, సీఐడీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేస్తామన్నారు.
